10th Class Exams After June first week

 


 10 వ తరగతి పరీక్షలు జూన్‌


 మొదటి వారం తర్వాత



తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీ¤క్ష నిర్వహించి, జూన్‌ 4న నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని, పరిస్థితి తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని న్యాయస్థానం సూచించింది.


 


గతంలో రెండు సబ్జెక్టులకు సంబంధించి 3 పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలని బాలకృష్ణ అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షలు వాయిదా వేయాలని అప్పట్లో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన 8 పరీక్షలు వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఈ నెలలోనే పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గతంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కరోనా నివారణ చర్యలన్నీ తీసుకుంటాం..విద్యార్థులకు రవాణా సదుపాయాలు కల్పిస్తాం, 5.50లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది.


 


 


దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‌ తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతోందని, పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. జూన్‌ 3న సమీక్ష నిర్వహిస్తామని ఏజీ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించాలని, కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే వాయిదా వేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతీ పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండాలని, భౌతికదూరం సాధ్యం కాని పరీక్షా కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో నిర్వహించవద్దని సూచించింది.