Uses of Coriander

ధనియాల ఉపయోగాలు మెండు 


 


    


 


       అభ్రకాన్ని శుద్ధి చేసేందుకు ఆయుర్వేద వైద్యులు ధనియాలని ప్రముఖంగా వాడతారు. కఠినమైన ఖనిజాల్నే శుద్ధి చేయగల శక్తి ఉన్న ఈ ధనియాలు సున్నితమైన శరీరాన్ని ఇంకెంతంగా సంరక్షిస్తాయో తెలుసుకుందాం!


      మధుమేహం, పేగుపూత, నోటిపూత, మూత్రవ్యాధులు అతిగా దప్పిక, అజీర్తి, నెమ్ము, జలుబు, జ్వరం, శోష, అలర్జీ ఈ వ్యాధులన్నింటి పైనా ధనియాల ప్రభావం వుంది. చేదు, కారం వుండని విచిత్రమైన రుచి వీటిది.


        ధనియాల్ని దంచి, నీళ్లు కలిపి గుడ్డలో వేసి పిండి తీసిన రసమే ధనియాల కషాయం. అంటే దాహాన్ని తగ్గించి మూత్రాన్ని ఎక్కువ జారీచేసి, వంటికి పట్టిన నీరు తగ్గించే గుణం దీనికుంది. ధనియాల కషాయం తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది. ఎప్పుడూ వేడిచేసిందంటూ బాధపడే వ్యక్తులు రోజూ దీన్ని పథ్యంగా తీసుకుంటే మూత్రంలో క్షారలక్షణాల్ని పెంచి వేడిని, ఆమ్లగుణాల్ని తగ్గించేస్తుంది. ఆగకుండా ఎక్కిళ్లు వచ్చేటప్పుడు ఇది ఠక్కున అవుతుంది.


       ధనియం గుండె జబ్బులకు పథ్యం. అజీర్తిపైన దీని ప్రభావం వేరే వివరించనవసరం లేదు. ధనియాల చారుకున్న శక్తిని అంత తేలికగా కొట్టివేయడానికి వీల్లేదు. దగ్గు, జలుబు, ఆయాసం విరేచనాలలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో పాముల్ని బైటపడేస్తుంది.


      ధనియాలు ఒక భాగం, ఎండించిన ముదురు చింతాకు ఒక భాగం, తగినంత ఉప్పు, కారం చేర్చి పొడిచేసి రోజూ అన్నంతో తింటే రక్తక్షీణత, ఆకలి తక్కువగా వ్ఞండడం, కామెర్ల వ్యాధులకు లివర్‌ను బలపరచి రోగశాంతిని ఇస్తుంది.
ధనియాలు మంచిగంధం కలిపి మెత్తగానూరి కళ్లు, నుదురు తలకు పట్టువేస్తే కళ్లు బైర్లు కమ్మడం, చీకట్లు ముసరడం, తలనొప్పులు, కళ్లకలకలు తగ్గుతాయి.



  • ధనియాల రసాన్ని రోజూ ఉదయం, సాయంకాలం తాగితే మధుమేహరోగులకు దాహం తగ్గుతుంది.

  • ధనియాలు, లవంగాలు, శొంఠి ఈ మూడింటినీ సమానంగా కలిపి వేడినీళ్లతో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. పంచదార, కర్పూరం కూడా కలిపి తీసుకోవచ్చు.

  • ఎలర్జీ లక్షణాలపైన ధనియాలకు మంచి ప్రభావం ఉంది. ఎలర్జీ వలన వచ్చే దద్దుర్లు, జలుబు, ముక్కుదిబ్బడ, ఆయాసం, దగ్గులకు ధనియాల కషాయం మంచి ఉపశమనాన్నిస్తుంది.