నిర్లక్ష్యమే  కొంప ముంచింది

 


 నిర్లక్ష్యమే  కొంప ముంచింది


 



కరోనా దెబ్బకు రష్యా విలవిల్లాడుతోంది. సరిహద్దున ఉన్న చైనాలో కరోనా విజృంభిస్తున్నపుడు... ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికాల్లోనూ వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నపుడూ రష్యాలో మాత్రం అతి తక్కువగా కేసులు నమోదయ్యాయి. మార్చిలో ధీమాగా కనిపించిన ఈ దేశం ఏప్రిల్‌ మొదటి వారం నుంచి డీలా పడటం మొదలైంది. 14.6 కోట్ల జనాభా ఉన్న రష్యాలో కేసులు దాదాపు 3 లక్షలకు చేరువయ్యాయి. ఎందుకిలా జరుగుతోంది? దేశమంతటా ఒకేలా ఉందా... అక్కడి ఆరోగ్య వ్యవస్థల పరిస్థితి ఏమిటి...?



నిర్లక్ష్యమే కొంప ముంచింది


ప్రపంచమంతా వైరస్‌ బారిన పడుతున్నప్పుడు రష్యా కొంతమేరకు సురక్షితంగానే కనిపించింది. అక్కడ జనవరి 30నే చైనాతో సరిహద్దును మూసేశారు. దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణికుణ్ని పరీక్షించాలని అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. అయితే... క్షేత్రస్థాయిలో అటు అధికారులు, ఇటు ప్రజలు సమస్య తీవ్రతను పట్టించుకోలేదు. ఇటలీ, ఫ్రాన్స్‌ లాంటి దేశాల నుంచి వచ్చే వారినీ సరిగ్గా పరీక్షించకుండానే వదిలేశారు. లాక్‌డౌన్‌ విధించినా ప్రజలు వీధుల్లోనే తిరిగారు. గుమిగూడటం ఆపలేదు. దాని ఫలితమే ప్రస్తుతం ఈ దేశంలో రోజుకు సగటున 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో సగం దేశ రాజధానిలోనే ఉంటున్నాయి. మొదట్లో మాస్కోలోనే కేంద్రీకృతమైన వైరస్‌... ప్రస్తుతం దేశమంతటా వ్యాపిస్తోంది. దేశప్రధాని, ముగ్గురు మంత్రులు, అధికార ప్రతినిధి వైరస్‌ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కొనసాగించాలా, సడలించాలా అన్న నిర్ణయాన్ని అధ్యక్షుడు పుతిన్‌... స్థానిక నాయకులకే వదిలేశారు. ఓ సందర్భంలో ‘దశలవారీగా దేశమంతటా ఆంక్షలు తొలగిస్తా’మని ఆయన ప్రకటించగా... ‘తామేమీ తొందరపడటం లేద’ని మాస్కో మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ భిన్నంగా స్పందించారు. పరిస్థితిని అంచనా వేయకుండా పరిమితులు ఎత్తేస్తే మహమ్మారి రెండోసారీ విజృంభించే ప్రమాదం ఉందనేది మేయర్‌ వాదన.